కట్టుబాట్లు – దురాచారాలు, ఇల్లు – ఎలుకలు, 498A – తలతిక్క వాదాలు, AFSPA ..!!


కొండలరావు గారు ఏర్పాటు చేసిన చర్చా వేదిక ప్రజ – (ప్రశ్న మీదే – జవాబు మీదే) .. బ్లాగులో నేను చేసిన కొన్ని కామెంట్లు ఇవి. వాటిలో కొన్ని, కొంత మందికి నేను ఇవ్వాలనుకుంటున్న సమాధానాలు. అందుకే ఇక్కడ ఉంచుతున్నాను.

కట్టుబాట్లు – దురాచారాలు :

అసలు కట్టుబాట్లు, దురాచారాలు అనేవి ఏమిటి? అవి ఎలా ఉద్బవించాయి? వాటికారణంగా స్త్రీలు ఎందుకు బాధలు పడ్డారు? ఈ కట్టుబాట్లనేవి ఒకప్పటి చట్టాలే. వాటికి కారణం పురుషాధిక్యత కావచ్చు లేక పోతే మతం కావచ్చు. అలాంటి కట్టుబాట్లు (చట్టాలు) రావడానికి కారణమయ్యాయి. కానీ, ప్రస్తుతం ఆ కట్టుబాట్లకు విలువ లేదు. కానీ, సమాజములో ఇంకా కొన్ని మనుగడ సాగిస్తున్నాయి. మరికొన్ని అంతరించి పోయాయి. ఆడపిల్ల చదవకూడదు అనో, స్త్రీలకు స్వాతంత్రము ఉండ కూడదు అనో చేసిన ఒకప్పటి చట్టాలు ఇప్పుడు పాటించాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? లేదు. కొన్ని చోట్ల అవి రుద్దబడుతూ ఉండొచ్చు. కానీ, ఎవరైనా ఎదిరించి నిలబడితే అవి పారిపోతాయి. అంటే కాలితో తంతే పోయేవే కట్టుబాట్లు ప్రస్తుతం.

కానీ, చట్టాలు అలా కాదు. చట్టాలను కాదు అనడానికి వీలు లేదు. ఇష్టమున్న లేకపోయినా వాటిని ఆచరించి తీరాల్సిందే. అంటే మనము ఒక సరికొత్త ప్రపంచజీవన విధానాన్ని (New World Order) చట్టాల ద్వారా నిర్దేశిస్తున్నాము. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. 498A కేసును నిరభ్యంతరంగా దురుపయోగం చేసి మగవాడి మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఫెయిలయిన ప్రతీ వివాహం మగాడికి ఒక నరకముగా మార్చొచ్చు. ఆ వివాహం విచ్చిన్న మవడానికి ఇరువురూ కారణమే అయినా సరే. ఆడది తలుచుకుంటే ఈ పని చేయొచ్చు. దాన్ని మగాడు కాదన్నా ఆగదు, సాక్షాత్తూ సుప్రీము కోర్టే 498A దురుపయోగం లీగల్ టెర్రరిజం గా మారింది అని స్టేట్‌మెంటిచ్చినా మారదు. ప్రెసిడెంటు సైతం అవి భారీగా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పినా ఆగదు.

కొన్ని చోట్ల చట్టాలు అసలు అమలవ్వక పోవచ్చు, లేదా మంచి పవర్‌ఫుల్ పొజిషన్లో ఉన్న వాల్లకు ఏవన్నా వెలుసు బాట్లు దొరికుండొచ్చు. వారి విషయములో కూడా న్యాయ పోరాటం చేస్తే శిక్షలు వేయించొచ్చు. దానికి ఎప్పుడైనా స్కోపు ఉంటుంది.

498A దుర్వినియోగం ఎవరో ఒకరు పెద్ద పదవులలో ఉన్న వారు చెప్పారనో, ఒకరిద్దరు దురుపయోగం అవుతుందని చెప్పారనో .. అందరూ అంటున్నది కాదు. దానికి చెందిన, గణాంకాలూ పురుష హక్కుల కార్యకర్తలు అందరికీ చూపించిన తరువాత, అనేక డిబేట్ల తరువాత మాత్రమే అది నిజమని అంగీకరించడం జరిగింది. ఒక్క సారి యూట్యూబు కెల్లి 498A అని టైప్ చేయండి. ఎన్ని డిబేట్లు కనిపిస్తాయో. అవన్నీ అనేక మహిళా సంఘాలు, పురుష హక్కుల సంఘాలూ అనేక టీ.వీ ఛానల్లలో చేసిన చర్చలే. కనీసం నాలుగైదన్నా డిబేట్లో అవి దురపయోగం అవ్వడం లేదు అని నిరూపిత మయ్యుంటే చూపించండి.

ఒక్కసారి పురుష హక్కుల సంఘాల వాల్లు గణాంకాలు చూపించడం మొదలు పెట్టిన తరువాత న్యూట్రలుగా ఉందే వారంతా అంగీకరించారు. అవి దురుపయోగం అవుతున్నాయని.

ఇల్లు – ఎలుకలు, 498A – తలతిక్క వాదాలు :

ఎలుకలున్నాయని ఇంటిని తగల బెడతామా? దుర్వినియోగం ఉందని చట్టాలు వద్దంటామా అని చెప్పిన వారున్నారు. సరే, ఇంటిని తగల బెట్టా వద్దు, చట్టాలను మార్చావద్దు. దురుపయోగం చేసే వాల్లకు శిక్షలు కూడా అదే చట్టములో చేర్చండి. భయం అనేది ఇరువురికీ ఉండాలి కదా? కానీ, అలా జరగలేదు.

ఎక్కడిదాకానో ఎందుకు ప్రస్తుతం జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన రిపోర్టు తీసుకోండి. అందులో పనిచేసే చోట మహిళలపై వేదింపులకు చెందిన చట్టములో 14 వ సెక్షన్ను తొలగించడం జరిగింది. అదేమిటో తెలుసా, ఎవరైనా మహిళ ఈచట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఆమెకు ఆయా సంస్థలలో ఉన్న రూల్సుకు అనుగుణంగా శిక్షించాలని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది సెక్సువల్ హరాస్‌మెంట్ చేసిన మగవారికి విధించే శిక్షలతో పోలిస్తే నామ మాత్రం. కానీ, జస్టిస్ వర్మ తన రిపోర్టులో ఈ సెక్షన్ను తొలగించ మని సూచించారు. కారణ మేమిటో తెలుసా? అది ఆయా సంస్థలు దురుపయోగం చేసే అవకాశం ఉందని.

చూశారా? దురుపయోగం చేసి మగవారిని ఇబ్బంది పెడితే, అది పెద్ద విషయం కాదు. ఇల్లు తగలెట్ట కూడదు లాంటి సామెతలు చెబుతారు. అదే దురుపయోగం ఆడవారిపై జరుగుతుంది అని తెలిస్తే అసలు ఆ సెక్షన్నే ఎత్తేస్తారు (అవకాశం ఉందని తెలిస్తే, ఇంక అవ్వలేదండోయ్). దాని బదులు, దురుపయోగం ఎవరు చేసినా శిక్షలు ఉండేలా చట్టాన్ని చేయొచ్చు కదా? దురుపయోగం చేస్తే శిషించ వద్దని మగవారు చెప్పడం లేదే?

అదండీ మన జెండర్ ఈక్వాలిటీ కథ.

—————————————————————————-

విశేషమేమిటంటే, చట్టాలు దుర్వినియోగం అవ్వడం వాటిని రద్దు చేయడనికి ప్రాతిపదిక కాదు అని నీతులు చెప్పిన వారే, , భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA – Armed Forces Special Powers Act) దురుపయోగ మవుతోంది కాబట్టి దాన్ని తీసేయమని చెబుతారు. ఎందుకు? దురుపయోగం అనేది చట్టాలు తీసేయడానికి కారణం కాదు కదా? ఇంట్లో ఎలుకలున్నాయని, ఇల్లు తగలబెట్ట కూడదు కదా? కానీ, వీరు వీటి గురించి ఆలోచించేప్పుడు అలాంటివి అస్సలు ఆలోచించరు. కారణం ?

—————————————————————————-

ఇక చట్టాల గురించి నేను చెప్పాలనుకునేదేమిటంటె.. అవంటే నాకు వ్యతిరేకత లేదు. కేవలం అవి దుర్వినియోగ మయ్యి మరో కొత్తరకం బాదితులను సృష్టించొద్దు అన్న ఉద్దేశ్యం తప్ప. అందుకే నేను చెప్పేది ఏమిటంటె ..

చట్టాలు చేసేప్పుడు మరియూ ఇప్పటి వరకూ ఉన్న చట్టాలలో — “స్త్రీ” లేదా “పురుషుడు” అని ఉన్న చోట్ల “వ్యక్తి” అని, “భార్యా” లేదా “భర్త” ఉన్నచోట “జీవిత భాగ స్వామి” అని చేర్చండి. దీని ఆవశ్యకత ఎక్కడుంటే అక్కడ ఈ నియమాన్ని అనుసరించి చట్టాలు చేయండి. అదే కాదు, దురుపయోగం ఎవ్వరు చేసినా సరే (ఆడైనా, మగైనా మరొకరైనా) శిక్షలు పడే విధంగా ఆ చట్టాలలోనే నిబందనను చేర్చండి.

(Make every law gender neutral. Replace “Man” or “Women” with “Person”, “Husband” or “Wife” with Spouse where ever it is applicable.  And include the clause, such that every misuser punished. This is the standard demand of All Men Organizations)

చట్టాల దుర్వినియోగం ఎందుకు సీరియసుగా తీసుకోవాలో పైన దురాచాలు, కట్టు బాట్లు అనే వాటిలో చెప్పాను. ఈ దురాచాలు – కట్టుబాట్లు అనేవి ఒకప్పటి చట్టాలు. ప్రస్తుతం ఉన్న చట్టాల దురుపయోగం కూడా పట్టించుకోకపోతే ఆ స్థాయికి వెల్లే ప్రమాదముంది. అసమానతలనుండి అసమానతలవైపు ప్రయాణం గా అది మారుతుంది.

సమాజములో కొంత మందికి అన్యాయం జరుగుతోంది అని చెబితే, దానికి కారణం ఏమిటి అని కాకుండా, వారిది ఏ వర్గం (ఏ క్లాసు) అని చూసుకొని అభిప్రాయాలకి రావడం కన్నా ఊరకుండడం మేలు. అదే సమాజానికి గొప్ప మేలు.  అటువంటి సిద్దాంతాల కన్నా, ఎవరికి అన్యాయం జరిగినా చర్యలుండాలనే “తలతిక్కే” మేలేమో కదా?